Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ దాడుల నేపథ్యంలో కళాశాల ముందస్తు జాగ్రత్తలు
- తల్లిదండ్రులకు ఫోన్లు
నవతెలంగాణ హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకి ఫోన్లు వస్తున్నాయి. 'మీ పిల్లలు మా కాలేజిలోనే చదువుతున్నారు కదా, ఎవరైనా బయటి వ్యక్తులు ఫోన్ చేసి కాలేజికి ఏమైనా డొనేషన్ కట్టారా అని అడిగితే.. కట్టలేదని చెప్పకండి. మీకు, మాకు ఇబ్బంది లేకుండా చూసుకోండి` అన్న ఆ ఫోన్ల సారాంశం. ఐటీ దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులందరికీ ఈ విధమైన ఫోన్లు వస్తున్నాయి. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. కళాశాలల్లో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంజినీరింగ్, వైద్య కళాశాలల యాజమాన్యాలు.. తాము డొనేషన్ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
లక్షల్లో వసూలు.. లెక్కల్లో నిల్
ఇంజినీరింగ్ కాలేజిలో ప్రవేశాల కోసం ఏకంగా లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయి. కాలేజి స్థాయి, బ్రాంచిని బట్టి 6 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశారు. మరి కొన్ని ప్రముఖ కళాశాలలు కంప్యూటర్ సైన్స్‌కు 12 నుంచి 15 లక్షలు వసూలు చేశాయి. ఇవి కాక ఇతరితర ఫీజులు షరా మాములే. ఒకే దఫాగా నగదు రూపంలోనే వసూలు చేస్తారు. వీటికి రసీదులుండవు. ఇవన్నీ కళాశాలల లెక్కల్లో ఉండవు. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. తత్ ఫలితమే డొనేషన్ కట్టారా అని అడిగితే.. కట్టలేదని చెప్పకండంటూ ఫోన్లు చేస్తున్నారు.