Authorization
Fri May 16, 2025 01:37:05 pm
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ ‘అమెజాన్’కు చెందిన భారతీయ విభాగం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్-డెలివరీ వ్యాపార విభాగం ‘అమెజాన్ ఫుడ్’ను డిసెంబర్ 29 నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరు నగరంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వ్యాపారాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా నిష్ర్కమించనున్నట్టు స్పష్టం చేసింది. కంపెనీ వార్షిక కార్యకలాపాల ప్రణాళికా సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. కాగా ఈ నిర్ణయంపై ఇదివరకే పలు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా భారత్‌లో హైస్కూల్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ అకాడమీ’ను మూసివేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించిన మరుసటి రోజునే తాజా ప్రకటన రావడం గమనార్హం. కాగా అమెజాన్ అకాడమీకి కొవిడ్ సమయంలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత అంతగా ఆదరణ లేకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.