Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యా మాధ్యమంగా హిందీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై వృద్ధుడైన ఒక రైతు ఆందోళన చెందాడు. ‘మోడీ.. హిందీని మాపై రుద్ద వద్దు’ అంటూ నినాదాలు చేసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లాలోని తలైయూర్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. రైతైన 85 ఏళ్ల తంగవేల్, డీఎంకే వ్యవసాయ సంఘం మాజీ ఆర్గనైజర్. దేశ వ్యాప్తంగా హిందీలో విద్యా బోధనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన కలత చెందాడు. దీని వల్ల నిరుపేద, రైతు కుటుంబాల విద్యార్థులు నష్టపోతారని ఆందోళనకు గురయ్యాడు.
కాగా, శనివారం ఉదయం తలైయూర్‌లోని డీఎంకే కార్యాలయం వద్దకు తంగవేల్ చేరుకున్నాడు. కేంద్రం బలవంతంగా హిందీని రుద్దడంపై నిరసన తెలిపాడు. ‘మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.. మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష. హిందీ భాషను రుద్దితే విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతుంది. హిందీ వద్దే వద్దూ’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సజీవంగా కాలిపోయి అక్కడే చనిపోయాడు. మరోవైపు డీఎంకే కార్యకర్త అయిన తంగవేల్ ఆత్మహత్యపై తమిళనాడులోని అధికార పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ విద్యా సంస్థల్లో హిందీ బోధనను అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తామని సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన సంఘం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు.