Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు గుంటకండ్ల పిచ్చిరెడ్డి (96) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల కాలుకు శస్త్ర చికిత్స జరిగిన అనంతరం హైదరాబాద్ బ్రిన్నోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పిచ్చిరెడ్డికి భార్య సుశీల, కుమార్తెలు భారతి, కరుణకుమారి, దయాకర్ రెడ్డి ఉన్నారు. పిచ్చిరెడ్డి ‘ప్రజాపక్షం’ ఎడిటర్ కే శ్రీనివాస్ రెడ్డికి స్వయానా మామ. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి పెద్ద నాన్న. ఆయన కూతురు కరుణ కుమారి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలిగా కొనసాగారు.
పిచ్చిరెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకర్గంలోని నాగారం గ్రామం. ఆయన కుటుంబం కమ్యూనిస్టు కుటుంబంగా పేరొందింది. నాగారం గ్రామానికి 45 సంతవత్సరాల పాటు సుదీర్ఘకాలం సర్పంచ్ పని చేశారు. అలాగే నాన్ బ్లాక్ సమితి ప్రెసిడెంట్‌గా సేవలందించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి, గణనీయమైన సంఖ్యలో ఓట్లు పొందారు. ఆయన పాత సూర్యాపేట, తుంగతుర్తి తాలూకా సీపీఐ కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర సమితి సభ్యులుగా పని చేశారు. విద్యార్థి దశలోనే పిచ్చిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. సూర్యాపేట కేంద్రంగా ప్రముఖ కమ్యూనిస్టు ధర్మభిక్షం ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొన్నారు. అనంతర కాలంలో ఆంధ్ర మహాసభలో చేరి సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి, అనేక సంవత్సరాలు అజ్ఞాత వాసం గడిపారు. చివరకు నిజాం సైన్యం చేతికి చిక్కి 23 నెలల పాటు కఠిన జైలు జీవితం అనుభవించారు.
సీపీఐ నేతల నివాళి
పిచ్చిరెడ్డి మృతి వార్త తెలుసుకున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసుపత్రికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తుది వరకు కమ్యూనిస్టు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నేత అని నారాయణ గుర్తు చేసుకున్నారు. చివరి ఊపిరి వరకు కమ్యూనిస్టు పార్టీకే అంకితమయ్యారని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పిచ్చిరెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. పిచ్చిరెడ్డి నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని సీనియర్ సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.