Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు గుంటకండ్ల పిచ్చిరెడ్డి (96) శనివారం కన్నుమూశారు. ఇటీవల కాలుకు శస్త్ర చికిత్స జరిగిన అనంతరం హైదరాబాద్ బ్రిన్నోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పిచ్చిరెడ్డికి భార్య సుశీల, కుమార్తెలు భారతి, కరుణకుమారి, దయాకర్ రెడ్డి ఉన్నారు. పిచ్చిరెడ్డి 'ప్రజాపక్షం' ఎడిటర్ కే శ్రీనివాస్ రెడ్డికి స్వయానా మామ.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి పెద్ద నాన్న. ఆయన కూతురు కరుణ కుమారి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలిగా కొనసాగారు. సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జరిగిన సీపీఐ రాష్ట్ర మూడవ మహాసభలో పిచ్చిరెడ్డి పాల్గొని, పార్టీకి రూ.50వేలు భూరి విరాళంగా అందజేశారు. కేంద్రంలోని మత ఛాందసవాద ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కమ్యూనిస్టులు ఏకం కావాలని, భూ సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి ఉద్యమించాలని ఈ సందర్భంగా తన ప్రసంగం ద్వారా ప్రతినిధులను ఉత్సాహపరిచారు. విజయవాడలో జరిగిన జాతీయ మహాసభకు వెటరన్ ప్రతినిధిగా హాజరుకావాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణంగా వెళ్లలేకపోయారు.