Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2023 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత నెల 16న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కైరోలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన భారత ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఈజిప్ట్ అధ్యక్షుడికి అందించారు. 'ది అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్' అధ్యక్షుడు తొలిసారి ముఖ్య అతిథిగా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొననున్నారని విదేశాంగశాఖ పేర్కొంది. ఈ ఏడాదితో భారత్, ఈజిప్ట్ దౌత్య సంబంధాలు ఏర్పర్చుకొని 75ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆధ్వర్యంలో జరగనున్న 2022-23 జి 20 సమావేశాలకు ఈజిప్టును అతిథిగా ఆహ్వానించారు. భారత్-ఈజిప్ట్ మధ్య నాగరికత ఆధారంగా లోతైన సంబంధాలు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటనలో పేర్కొంది.
1950 నుంచి భారత్ మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించారు. 2007లో పుతిన్(రష్యా), 2008లో నికోలస్ సర్కోజీ(ఫ్రాన్స్), 2015లో బరాక్ ఒబామా (అమెరికా), 2016లో ఫ్రాన్సోయిస్ హోలన్ (ఫ్రాన్స్)లు అతిథులుగా హాజరయ్యారు. 2021లో నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. కానీ, కొవిడ్ కేసులు పెరగడంతో ఆయన పర్యటన రద్దైంది. 2018లో ఆసియాన్ దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు.