Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్పూర్‌లో టీచర్ ఘాతుకం.. రెండో ఎక్కం చెప్పలేదని విద్యార్థిని చేతికి డ్రిల్లింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో దారుణం జరిగింది. ప్రేమ్‌నగర్ ఏరియాలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని రెండో ఎక్కం చెప్పమని టీచర్ అడిగాడు. కానీ విద్యార్థిని ఎక్కం చెప్పలేకపోయింది. దాంతో ఆగ్రహించిన టీచర్ విద్యార్థిని చేతికి డ్రిల్లింగ్ చేశాడు. ఇంతలో పక్కనే ఉన్న మరో విద్యార్థిని డ్రిల్లింగ్ మెషిన్ ప్లగ్‌ను తీసేయడంతో పెద్ద గాయం కాలేదు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థిని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున స్కూల్ ముందు గుమిగూడి ఆందోళనకు దిగారు.
దాంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దాంతో విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు విద్యార్థిని తల్లిదండ్రులను, పాఠశాల యాజమాన్యాన్ని ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అటు పోలీసులు కూడా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.