Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా దిగ్గజం, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ లాంటివాడని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నుంచి అసాధారణ షాట్లు ఆడుతూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు నిద్రలేకుండా చేస్తాడని పేర్కొన్నాడు. దూకుడైన ఆటతీరు వల్ల అతడు ఒకటి,రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కావొచ్చని, ఒక వేళ 15-20 పరుగులు దాటితే విధ్వంసం సృష్టిస్తాడని రవిశాస్త్రి తెలిపాడు.
'సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ టీ20 ప్లేయర్ కాకపోయినా.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఆల్‌రౌండ్ గేమ్ అతడి సొంతం. సూర్యకుమార్ విధ్వంసకర ఆటగాడు. తనదైన రోజు, అతడు 30-40 బంతులు ఎదుర్కొంటే మ్యాచ్‌ని గెలిపించగలడు. ఎందుకంటే తనదైన షాట్లతో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు నిరుత్సాహపడేలా చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఏబీ డివిలియర్స్ లాంటివాడు. ఎప్పుడైనా డివిలియర్స్ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడితే ప్రత్యర్థి జట్టు వణికిపోతుంది. సూర్యకుమార్ ఒక్కడే ఇప్పుడలా చేయగలడు' అని రవిశాస్త్రి అన్నాడు. న్యూజిలాండ్,భారత్ మధ్య రెండో వన్డే వర్షార్పణం అయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆటంకం కలిగించిన వర్షం.. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్ద భారీగా కురవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్ 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది. ఈ మ్యాచ్ కొద్దిసేపే సాగినా సూర్యకుమార్ యాదవ్ వినూత్నమైన షాట్లు ఆడి ఏబీ డివిలియర్స్‌ని మరిపించాడు. తొలుత ఇన్నింగ్స్‌ని నెమ్మదిగానే ఆరంభించగా.. సూర్య 11వ ఓవర్ నుంచి జోరు పెంచాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లున్నాయి.