Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికారు. కొన్ని రోజులు వాటిని ఫ్రిజ్‌లో దాచారు. అనంతరం తల్లి, కుమారుడు కలిసి మృతదేహం ముక్కలను రెండు ప్రాంతాల్లో పడేశారు. ఈ దారుణ సంఘటన కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. ఈ ఏడాది జూన్ 5న త్రిలోక్‌పురిలోని పండవ్‌నగర్‌లో మృతదేహం శరీర భాగాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడు ఎవరన్నది గుర్తించలేక పోయారు. కాగా, శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో పండవ్‌నగర్‌లో లభించిన శరీర భాగాలకు డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించారు. ఆ భాగాలు మగ వ్యక్తివిగా తేలింది. దీంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పండవ్‌నగర్‌లో శరీర భాగాలు లభించిన చోట సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఒక యువకుడు ఒక సంచిని పట్టుకుని అక్కడకు వెళ్లగా మరో మహిళ అతడ్ని అనుసరించింది. జూన్ నెలలో రాత్రి వేళ, మరోసారి పగటి వేళ కూడా వారిద్దరూ అక్కడ కనిపించారు.
మరోవైపు పోలీసులు ఆ ప్రాంతంలో మిస్సింగ్ అయిన వారి గురించి ఆరా తీశారు. అంజన్ దాస్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు గుర్తించారు. అతడి రెండో భార్య పూనమ్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దీంతో పూనమ్, ఆమె కుమారుడు దీపక్ దాస్‌ను పోలీసులు ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయ్యింది. 2016లో మొదటి భర్త కల్లు చనిపోవడంతో 2017లో అంజన్ దాస్, పూనమ్‌కు రెండో పెళ్లి జరిగింది. ఆమె కుమారుడు దీపక్ దాస్ తొలి భర్త సంతానం. కాగా, అంజన్ దాస్‌కు కూడా ఇది రెండో పెళ్లి. బీహార్‌లో అతడి మొదటి భార్య ఉండగా వారికి ఎనిమిది మంది పిల్లలు. అయితే ఏ పని చేయని అంజన్ దాస్, తమ సంపాదనపై ఆధారపడ్డాడని, తన బంగారం అమ్మి ఆ డబ్బును మొదటి భార్యకు పంపాడని పూనమ్ ఆరోపించింది. దీపక్ దాస్ భార్యను కూడా అతడు వేధిస్తుండటంతో హత్య చేసినట్లు పోలీసులకు ఆమె చెప్పింది. మరోవైపు ఈ హత్య వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మే 30న నిద్ర మాత్రలు కలిపిన మద్యాన్ని అంజన్ దాస్‌తో నిందితులు తాగించారు. అనంతరం దీపక్ దాస్ కత్తితో అంజన్ దాస్ గొంతు కోసి హత్య చేశాడు. రక్తం పోయేంత వరకు మృతదేహాన్ని ఒక రోజంతా అలా వదిలేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పది ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఇంట్లోని భారీ ఫ్రిజ్‌లో దాచారు. జూన్ 5న పండవ్‌నగర్‌లో, ఆ తర్వాత కళ్యాణ్‌పురిలోని రాంలీలా మైదానం వద్ద శరీర భాగాలను పడేశారు. ఇప్పటి వరకు ఆరు శరీర భాగాలు (రెండు కాళ్లు, రెండు తొడలు, ఒక పుర్రె, ముంజేయి) లభించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంజన్ దాస్ హత్యకు సంబంధించి పూనమ్, ఆమె కుమారుడు దీపక్ దాస్‌ను అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రైమ్) అమిత్ గోయల్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా విడుదల చేశారు.