Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమెరికాలోని మిస్సోరిలో విషాదం నెలకొంది. ఓజార్క్స్ లేక్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. మృతులను ఉత్తేజ్ కుంట(24), శివ కెళ్లిగారి(25)గా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ ఘటన శనివారం జరిగిందని పేర్కొన్నారు. అయితే అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఒక మృతదేహం లభించింది. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో మరో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో ఓజార్క్స్ లేక్‌లోకి ఉత్తేజ్, శివ కలిసి స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లారు. మొదట ఉత్తేజ్ నదిలోకి వెళ్లగా, ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఉత్తేజ్‌ను కాపాడేందుకు వెళ్లిన శివ కూడా నీటి మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు మిస్సోరి స్టేట్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది పేర్కొన్నారు. ఇద్దరు తెలంగాణ వాసులు మిస్సోరిలో చనిపోయిన విషయాన్ని నంద్యాల కార్తీక్ రెడ్డి అనే నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్‌లో తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని తమ టీమ్‌ను ఆదేశించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.