Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎయిమ్స్ ప్రధాన సర్వర్ 23 బుధవారం నాడు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సర్వర్‌లో దాదాపు 3-4 కోట్ల మంది రోగుల డాటా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ డౌన్ కావడంతో ఎమర్జెన్సీ ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, లేబొరేటరీ విభాగాల్లో పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు.
ఈ హ్యాకింగ్‌పై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై దోపిడీ, సైబర్ టెర్రరిజం కేసును ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ నమోదు చేసింది. గత ఆరు రోజులుగా సర్వర్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోనే ఉన్నది. దాంతో దవాఖానలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రిలోని ఓపీడీ, ఐపీడీలకు వచ్చే రోగులు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, టెలికన్సల్టేషన్ వంటి డిజిటల్ సేవలు కూడా సర్వర్ అంతరాయంతో ప్రభావితమయ్యాయి. అయితే, ఈ సేవలన్నీ మాన్యువల్‌గా అమలు చేస్తూ రోగులకు ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.