Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో మందిరంలో రెండు పడక గదుల ఇండ్లు, స్థలాలు, రోడ్ల విస్తరణ, అనధికార కట్టడాలు, అమరవీరుల స్తూపం ఏర్పాటు తదితర అంశాలపై ఆయన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని, సబ్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్, ఎస్పీ కార్యాలయం వరకు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్‌కు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విద్యుత్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
రోడ్ల విస్తరణ వెంటనే పూర్తి చేయాలని, అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసేందుకు తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనధికార కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్ స్టోర్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఘనపూర్ రెండు పడక గదుల ఇండ్లు, రేవల్లి స్థలాలను అర్హులైన నీరు పేదలకు అందించాలని ఆయన సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) డీ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఎంఆర్‌వో రాజేందర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.