Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత ఫిరోజాబాద్‌లోని ఓ ఫర్నీచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే అదే బిల్డింగ్ మొదటి అంతస్థులో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. మంటలు ఫస్ట్‌ఫ్లోర్‌కు వ్యాపించడంతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వృద్ధుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. 18 ఫైర్ ఇంజిన్ల సాయంతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.