Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు గురువారం(డిసెంబర్ 1) నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్చేస్తున్నట్లు వివరించారు. నెల రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలించి, ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇకపై దీనిని ఉదయం 8 గంటలకు అనుమతిస్తారు. ఉదయం 10.30 నుంచి జనరల్ బ్రేక్ దర్శనం ప్రారంభిస్తారు.
తాజా నిర్ణయంతో సామాన్య భక్తులు వేచి ఉండే సమయం తగ్గనుంది. భక్తులు ఏరోజుకారోజు తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కాగా, మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి ట్రస్టు దాతల కోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్ ప్రారంభించారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్ లైన్ టికెట్లు, గదులు ఇక్కడే కేటాయిస్తారు.