Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: గుజరాత్‌లో గురువారం తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగనున్నది. 89 నియోజకవర్గాల నుంచి 788 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పోలింగ్‌కు ముందు రూ.290 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, ఇతర బహుమతులు పట్టుబడ్డాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రూ.27.21 కోట్లు విలువైన డబ్బులు, మద్యం, ఇతర బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో నవంబర్ 29 నాటికి స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.290.24 కోట్లకు చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కన్నా 10.66 రెట్లు ఎక్కువని చెప్పారు. పలు ప్రభుత్వ సంస్థల పక్కా నిఘా వల్లనే ఇంత విలువైన డబ్బు, మద్యం, డ్రగ్స్, ఇతర బహుమతులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు గుజరాత్‌లోని యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) వడోదర రూరల్, వడోదర సిటీలో పలు సోదాలు నిర్వహించి భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నది. రూ. 478 కోట్ల విలువైన 143 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ కేంద్రాలను గుర్తించింది. వీటికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసింది.