Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సినీ నటుడు సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ ట్విటర్ యూజర్ పెట్టిన పోస్టుకు స్పందించిన సోనూసూద్.. సారంగి వాయిద్యకారుడికి సహాయం చేస్తానని తిరిగి రీట్వీట్ చేశారు. హరియాణాకు చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్‌ఖాన్(83) ఆరోగ్యం బాగాలేదని, సాయానికి ఎవరు ముందుకు రావట్లేదని ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ట్విటర్ ద్వారా పోస్ట్ చేశాడు. అతని ఫోటో జత చేస్తూ, ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సోనూసూద్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. 'ఖాన్ సాహిబ్, ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, తర్వాత మీ సారంగి పాట వింటా' అని రీట్వీట్ చేశారు. హిసార్ జిల్లా ఖరక్‌పుర్ గ్రామానికి చెందిన మమన్‌ఖాన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు సైతం అందుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన.. సాయం కోసం ఎదురు చూస్తున్నారు.