Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు గత ఎనిమిది రోజుల వరుస లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. చైనాలో కొవిడ్ ఆంక్షల్ని సడలిస్తున్నప్పటికీ.. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే, నవంబరులో బలమైన వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు, తయారీ పుంజుకోవడం వంటి దేశీయ సానుకూల పరిణామాలు సూచీలకు కనిష్ఠాల వద్ద మద్దతుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 256 పాయింట్ల నష్టంతో 63,027 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 18,740 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.10 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉన్నాయి. మారుతీ, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎప్‌సీ, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.