Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఓ కారు కొంత దూరం పల్టీలు కొడుతూ వెళ్లి రహదారి పక్కనే ఓ వ్యవసాయ క్షేత్రం ఫెన్సింగ్ సైతం తెంచుకుని తోటలోకి దూసుకెళ్లింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ హాని లేకపోవడం కాస్త ఊరటనిచ్చింది. మండలంలోని నారంవారిగూడెం సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంతో పాటు కారు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇంతటి ప్రమాదంలోనూ కారులో ఇద్దరు, ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు స్వల్ప గాయాలతో బయట పడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరుకి చెందిన ఏడుకొండలు అయ్యప్ప మాల ధరించి ఇరు ముడులు చెల్లించు కునేందుకు ద్వారపూడి అయ్యప్పస్వామి ఆలయానికి భార్య రమ్యశ్రీ తో కారులో శుక్రవారం ప్రయాణిస్తున్నారు.
ఈ క్రమంలో దమ్మపేట మండలం జగ్గారం కి చెందిన కుర్సం సంతోష్, సోయం జశ్వంత్, కారం విశాల్ ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేట ఖమ్మం ప్రధాన రహదారిలో నారంవారిగూడెం సమీపంలో యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో కారు ఆ వాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న వ్యవసాయం క్షేత్రంలోకి దూసుకెళ్లింది. సమీపంలోని నర్సరీలలో ఉన్న కూలీలు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి కారులోని వారిని బయటకు తీశారు. కారులోని ఇద్దరికీ, ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను చిట్టితల్లి అంబులెన్స్ లో అశ్వారావుపేట సీ.హెచ్.సి కి తరలించారు. ఈ ఘటన దర్యాప్తు చేస్తున్నామని ఎస్.హెచ్.ఒ ఎస్సై రాజేశ్ కుమార్ తెలిపారు.
బారీ క్రేడ్ లతో వేగ నియంత్రణలు ఏర్పాటు చేస్తాం - ఎస్.హెచ్.ఓ రాజేష్ కుమార్ ప్రమాదం జరిగిన రహదారి ప్రదేశం లోతట్టుగా ఉండటంతో అతివేగంతో వస్తున్న వాహన దారులు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాలకు గురి అవుతున్నారని ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ప్రమాదాల నివారణకు బారీ క్రేడ్ లతో వేగ నియంత్రణలు ఏర్పాటు చేస్తామని, వాటి నిర్వహణను స్థానికులు చూసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంఘటన స్థలంలో ఉన్న స్థానిక సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యాన్ని కోరారు. ఆయన వెంట సిబ్బంది సంతోష్ కుమార్, వెంకటేశ్వరరావులు ఉన్నారు.