Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడుదల రజని రాష్ట్రంలోని అన్ని బోధనాస్పుత్రులతోపాటు ప్రధానమైన ఆస్పత్రులన్నింటినీ ఒక షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో గుర్తించినవాటిని ఉన్నతాధికారులతో చర్చించి అమలు చేయిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక బోధానాస్పత్రి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. డీఎంఈ కార్యాలయంలో వారాంతపు సమీక్ష జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను బోధనాస్పుత్రులకు పంపించారు. ప్రధానంగా ఈ డ్రస్ కోడ్‌ను ప్రస్తావిస్తూ వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకోవద్దని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పష్టంచేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర ధరించాలి లేదంటే చుడీదార్లు మాత్రమే వేసుకోవాలని సూచించింది. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు ఇకనుంచి శుభ్రంగా ఉండే దుస్తులు ధరించడంతోపాటు గడ్డం గీసుకోవాలి. మహిళలు తమ జుట్టు వదిలేయకూడదు. స్టెతస్కోప్, యాప్రాన్‌ను తప్పనిసరిగా ధరించాలని డీఎంఈ కార్యాలయం సూచించింది. నిర్దేశించిన డ్రస్ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాటించడంలేదు. ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. బోధనాస్పుత్రులకు వచ్చే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సిన సందర్భం వస్తే వారివెంట సహాయకులు లేరని తిరస్కరించరాదని ఆదేశించింది. ఫేస్ రికగ్నైజ్డ్ హాజరు విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ బోధనాస్పుత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు.