Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి అలోక్ కుమార్ షాహి కవితకు నోటీసులు జారీ చేశారు. 6వ తేదీన (వచ్చే మంగళవారం) విచారిస్తామని అందులో పేర్కొన్నారు. ‘‘కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమల్లో అవకతవకల ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 రెడ్ విత్ సెక్షన్ 120బీ, ఐపీసీ సెక్షన్ 447 ఏ కింద ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఈ కేసులో వెలుగులోకి వచ్చిన కొన్ని వాస్తవాలతో మీకు సంబంధం ఉన్నట్లు గుర్తించాం. దర్యాప్తు అవసరాల దృష్ట్యా ఆయా వాస్తవాల గురించి మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈమేరకు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు మిమ్మల్ని విచారించడానికి మీకు అనుకూలంగా ఉండే నివాసమేదో (హైదరాబాద్ లేదా వీలైనంతవరకూ ఢిల్లీ) చెప్పండి’’ అని కవితకు జారీ చేసిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. వారి అభ్యర్థన మేరకు.. హైదరాబాద్‌లోని నివాసంలో తనను ప్రశ్నించాల్సిందిగా సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని కవిత మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కవిత పాత్ర ఉందని.. ఆ పాలసీని రూపొందించే సమయంలో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు నిజమేనని ఈడీ వర్గాలు ఇటీవలే సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న నేపథ్యంలో సీబీఐ ఈ సమన్లు జారీ చేసినట్టు సమాచారం.