Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీహార్‌లో సెలవు పెట్టడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలంటూ భాగల్‌పూర్ కమిషనర్ దయానిధన్ పాండే ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వింత లీవ్ లెటర్లు భయటకొచ్చాయి. ఈ నెల 5న రాత్రి 8 గంటలకు మా అమ్మ చనిపోతారు. కాబట్టి అంత్యక్రియల కోసం 6, 7వ తేదీల్లో సెలవులు కావాలి, త్వరలోనే నా ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి 4, 5 తేదీల్లో సెలవు ఇప్పించండి. నేను ఓ పెళ్లికి వెళ్లాలి. అక్కడ బాగా తినేస్తాను కాబట్టి కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి ఏడో తేదీన నాకు సెలవు ఇవ్వండి అని లీవ్ లెటర్లు రాశారు. అయితే ఈ లీవ్ లెటర్లు రాసింది విద్యార్థులు కాదు ఉపాధ్యాయులు. ఈ వింత లీవ్ లెటర్ల విషయం వెలుగులోకి రావడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.
తన తల్లి చనిపోబోతోందని బాంకా జిల్లా కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు లీవ్‌కు దరఖాస్తు చేసుకుంటే, బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌గౌరవ్ తనకు త్వరలో ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి సెలవు కావాలని లీవ్ అప్లై చేశాడు. కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ తాను పెళ్లికి వెళ్తున్నానని, అక్కడ బాగా తింటాను కాబట్టి కడుపు నొప్పి వస్తుందని, బాధతో స్కూలుకు రాలేను కాబట్టి సెలవు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడం విశేషం.