Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందన్న సందేశాన్ని ఇచ్చారు.
ఈ తరుణంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితబంధు పథకాలతోపాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్‌ను అమలుచేస్తున్నామని తెలిపారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్‌తోపాటు మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన వీల్‌చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు మొదలైనవి సమకూరుస్తూ రోజువారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని, రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని, దివ్యాంగులను మనలో ఒకరుగా ఆదరిస్తూ వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.