Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. థాయ్ లాండ్ నుంచి ఇటీవలే వచ్చిన విద్యార్థినికి హిందీ నేర్పిస్తానంటూ ప్రొఫెసర్ రవిరంజన్ నమ్మించాడు. బేసిక్స్ నేర్పించే బుక్ కోసం ఇంటికి రమ్మంటూ బాధితురాలిని తన కారులోనే తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక అసభ్యంగా ప్రవర్తించాడని థాయ్ లాండ్ విద్యార్థిని పోలీసులకు తెలిపింది. మద్యం ఆఫర్ చేసి అసభ్యంగా తాకడంతో తాను ప్రతిఘటించానని తెలిపింది. దీంతో ప్రొఫెసర్ తనపై దాడి చేశాడని, ఆపై తన కారులోనే తీసుకొచ్చి యూనివర్శిటీ గేటు ముందు వదిలివెళ్లాడని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. ప్రొఫెసర్ రవిరంజన్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. మరోవైపు, ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేసినట్లు యూనివర్శిటీ అధికారులు తెలిపారు.
అయితే ప్రొఫెసర్ రవిరంజన్ ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు యూనివర్శిటీ విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపస్ లోపల ఎలాంటి ఘటనలు జరిగినా విచారించేందుకు వర్శిటీ తరఫున ఒక కమిటీ ఉందన్నారు. ప్రొఫెసర్ రవి రంజన్ వేధింపులకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులను కమిటీ విచారిస్తోందని తెలిపారు. ఆ కేసులలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇప్పుడు ఈ ఘటనకు అవకాశం కల్పించినట్టయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ ను శాశ్వతంగా వర్శిటీ నుంచి పంపేయాలనే డిమాండ్ తో క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.