Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కామెంటరీ చెబుతూ ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న పాంటింగ్ డిశ్చార్జి అయ్యాడు. మళ్ళీ యథావిధిగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ కు కామెంట్రీ షురూ చేశాడు. ఈ సందర్భంగా పాంటింగ్ నిన్న తనకు ఎదురైన ఆందోళనకర అనుభవాన్ని పంచుకున్నాడు. కామెంటరీ చెబుతుండగా ఛాతీలో సూదులతో గుచ్చినట్టు నొప్పి కలిగింది. దానికితోడు తల తిరుగుతున్నట్టు అనిపించడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాను. దాంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది అని వెల్లడించాడు.
నిన్న జరిగిన ఘటనతో తాను భయపడడమే కాకుండా, అనేకమందిని భయాందోళనలకు గురిచేశానని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, రాడ్నీ మార్ష్ గుండెపోటుతోనే కన్నుమూసిన నేపథ్యంలో తాను ఆందోళనకు గురయ్యానని పాంటింగ్ వెల్లడించాడు. గత ఏడాదిన్నకాలంలో జరిగిన ఘటనలలో నిన్న ఎదురైన అనుభవం తనకు మేలుకొలుపు వంటిదని భావిస్తున్నానని వివరించాడు. తనను కేవలం 15 నిమిషాల్లోనే ఆస్పత్రికి చేర్చారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపాడు.