Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫిట్స్‌తో బాధపడుతున్న ఓ రోగి మెదడులో ఉన్న కణతిని తొలగించేందుకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. సర్జరీ జరుగుతున్నంతసేపూ రోగిని మెలకువగా ఉంచారు. అతడికి ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్నిపర్వతం’ సినిమా చూపించారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోను కూడా చూపించారు. రోగి సినిమా చూస్తుండగానే వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరులోని శ్రీసాయి ఆసుపత్రిలో జరిగిందీ ఆపరేషన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పుల్లలచెర్వు మండలం ఇసుకత్రిపురాంతకం గ్రామానికి చెందిన గోపనబోయిన పెద ఆంజనేయులు (43) ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఏడేళ్లుగా ఎన్ని మందులు వాడుతున్నా తగ్గడం లేదు. దీంతో గుంటూరులోని శ్రీసాయి ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు మెదడులో 7.5 సెంటీమీటర్ల కణతి ఉన్నట్టు గుర్తించారు. కాలు, చేయి పనితీరును ప్రభావితం చేసే మెదడు ప్రాంతంలో కణతి ఉండడంతో రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేయాలని నిర్ణయించినట్టు న్యూరో సర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, మరో వైద్యుడు డాక్టర్ త్రినాథ్ తెలిపారు.
ఈ మేరకు గత నెల 25న ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అతడికి ఇష్టమైన ‘అగ్నిపర్వతం’ సినిమాను ఎదురుగా ఉన్న టీవీలో ప్రదర్శించారు. అలాగే, తనకు జగన్ అంటే ఇష్టమని చెప్పడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోను ప్రదర్శించారు. మామూలుగా అయితే మెదడుకు సర్జరీ చేయాలంటే జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. అయితే, కణతి కీలక ప్రాంతంలో ఉండడంతో స్కాల్ప్ బ్లాక్ ఎనస్థీషియా ఇచ్చి సర్జరీ చేశారు. కాగా, ఆపరేషన్ అనంతరం రోగి పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు.