Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వరకట్న దాహంతో భార్యలను వేధించే భర్తలను చూసుంటాం. ముహూర్తానికి ముందు అనుకున్నంత కట్నం ఇవ్వకపోతే వివాహం రద్దు చేసే వారినీ చూసుంటాం. అయితే ఉత్తరాఖండ్లోని ఓ అల్లుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. వరకట్నం కోసం కట్టుకున్న భార్యతో పాటు ఆమె పుట్టింటి వారిని వేధించే వ్యక్తులున్న ఈ కాలంలో తనకొచ్చిన కట్నాన్ని కాదని తిరిగి అత్తమామలకు ఇచ్చేశాడు ఓ అల్లుడు. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన ఈ వరుడు చేసిన పనితో సమాజంలోని పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. ఇక వధువు కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు.
సౌరభ్ చౌహాన్ అనే రెవెన్యూ అధికారికి.. విశ్రాంత ఆర్మీ జవాన్ కూతురు ప్రిన్స్కు శుక్రవారం తిటావి పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖన్ గ్రామంలో వివాహం జరిగింది. ఆచారాల్లో భాగంగా అతడికి రూ.11 లక్షల నగదుతో పాటు కొన్ని ఆభరణాలను ఇచ్చారు. అయితే వరుడు వాటన్నింటినీ తిరిగి ఇచ్చి ఒక్క రూపాయిని మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతడ్ని ప్రశంసలతో ముంచెత్తారు. సౌరభ్ను చూసి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాలని అన్నారు.