Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణించిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, కూల్చివేతలపై తాత్కాలిక నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే, అత్యవసర ప్రాజెక్టు నిర్మాణాలకు మినహాయింపునిచ్చారు. గత నెలలో రాజధాని ప్రాంతంలో గాలి స్వచ్ఛత రికార్డు స్థాయిలో క్షీణించి పోవడంతో భవంతుల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అక్కడి అధికారులను సూచించింది. దీనిని అమలు చేయడంతో రోజుల వ్యవధిలోనే గాలి నాణ్యత మెరుగుపడింది. దీంతో అధికారులు నిబంధనలను ఎత్తివేశారు. తాజాగా మరోసారి గాలి నాణ్యత పడిపోవడంతో తిరిగి ఆ నిబంధనలు అమలు చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.
ఢిల్లీలో ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు రోజు వ్యవధిలో సరాసరి గాలి నాణ్యత సూచీ 407గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏక్యూI 201-300 మధ్య ఉంటే గాలి నాణ్యత 'తక్కువ'గా ఉన్నట్లు లెక్క. అదే 301-400 మధ్య నమోదైతే 'బాగా తక్కువ'గా ఉన్నట్లు, 401-500 మధ్య ఉంటే నాణ్యత తీవ్రంగా పరిగణిస్తారు. నవంబరు 4 తర్వాత దిల్లీలో గాలి నాణ్యత ఇంత భారీగా తగ్గిపోవడం ఇదే తొలిసారి. ఆ రోజున ఏక్యూఐ 447గా నమోదైంది. అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా రోజుల వ్యవధిలోనే సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో నవంబరు 14న నిబంధనలను ఎత్తివేయడంతో ఏక్యూఐ అమాంతం పెరిగిపోయింది. దీంతో అధికారులు నివారణ చర్యలను మళ్లీ మొదలు పెట్టారు.