Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ నుంచి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 7 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ఈ నెల 6వ తేదీకి వాయుగుండంగా, ఏడో తేదీకి తుపాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీ రాత్రి లేదా 10వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేశారు. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో 7వ తేదీ రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని, ఈ నెల 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని దక్షిణ కోస్తాలోని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.