Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్వాపూర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-కోహెడ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో అన్ని కులాలు, మతాలు కలిసి ఉండడానికి భారత రాజ్యాంగమే కారణమన్నారు. ఆయన ప్రధానంగా అన్ని వర్గాలు బాగుపడాలని ముందు చూపుతో రాసిన రాజ్యాంగమేనన్నారు. సమాజసేవ, సమాజ హితం కోసం ఆరాటపడే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారని అందులో ముఖ్యుడు అంబేద్కర్ అన్నారు. 2014-15 సంవత్సరంలో 298 మాత్రమే గురుకులాలు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి సారించి 1021 గా పెంచారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో చదువుకునే వారి సంఖ్య 5,40,366 కి పెరిగిందన్నారు.
విద్య పై ప్రభుత్వం చేసే ఖర్చు రేపటి సమాజానికి, రాష్ట్రానికి సంపదగా మారి నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా జాతి సంపదగా ఉపయోగపడతారని సీఎం కేసీఆర్ విద్య పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం 50 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. అలాగే ఆడపిల్లల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి అందిస్తుందన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రతి పాఠశాలను బాగు చేసుకోవడం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్, ఇంటర్నెట్ సదుపాయాలను అందిస్తున్నామన్నారు.
హుస్నాబాద్ నియోజక అభివృద్ధికి ఎల్లవేళలా శాయశక్తులా సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ స్థానిక ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.