Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: చెన్నై కేంద్రంగా ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగనుంది. ఈ విషయాన్ని ఫెస్టివల్ డైరెక్టర్ ఈ.తంగరాజ్ తదితరులు సోమవారం వెల్లడించారు. అన్నాశాలైలోని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే చిత్రోత్సవాల్లో ప్రదర్శించే చిత్రాలను ఖరారు చేసి, తమిళ్ ఫిల్మ్ కాంపిటేషన్, ఇండియన్ పనోరమ కింద స్ర్కీనింగ్ చేస్తామన్నారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళ విభాగంలో ‘‘ఆధార్, బిగినింగ్, బఫూన్, గార్గి, గోట్, ఇరుది పక్కం, ఇరవిన్ నిళల్, కసడ తపర, మామణిదన్, నచ్చత్తిరం నగర్‌గిరదు ఓ2, యుద ధకాండం’’ చిత్రాలున్నాయి. అలాగే, ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు నుంచి ‘సినిమా బండి’, తమిళం నుంచి ‘కడైసి వివసాయి’, ‘పోత్తనూరు పోస్టాఫీస్’, ‘మాలైనేర మల్లిపూ’తోపాటు బెంగాలి, ఇరుల, మరాఠి, కన్నడ, ఒరియా, అస్సామీ, సంస్కృతం, హిందీ చిత్రాలున్నాయని ఆయన వివరించారు. ఈ చిత్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.