Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రయాణికురాలు వద్ద నగలు, నగదు దోచుకున్న మహిళను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 14న బోత్ మండలానికి చెందిన నల్ల అభినేత్రి, తల్లి శకుంతల, తన కొడుకుతో కలిసి బాసరలో దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా బ్యాగులో నుంచి బంగారం, నగదు ఉన్న కవర్ చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన అంజన బాయ్ రైల్వే స్టేషన్ రైలు భోగిలలో పిన్న్నీసులు విక్రయిస్తూ, అదును చూసి చోరీకి పాల్పడిందని ఆయన తెలిపారు. ఆమె వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల విలువచేసే 72 గ్రాములు బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయలు నగదు రికవరీ చేసినట్లు ఎస్సై వివరించారు. మహిళ ప్రయాణికురాలిని దోచుకుని పరారీలో ఉన్న అంజన బాయ్ మరో చోరీ కోసం యత్నించి పోలీసులకు చికిందన్నారు. రైల్వే ఐడి పార్టీ కానిస్టేబుల్ గురుదాస్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, వరలక్ష్మి, కానిస్టేబుల్ నజ్మా, చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును చేదించారని ఆయన పేర్కొన్నారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.