Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీకాకుళం గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు బరాటం రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు అగంతకులు కత్తి వేట్లకు తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా రామశేషుపై ఇలానే, ఇదే ప్రాంతంలోనే హత్యాయత్నం జరిగింది. అప్పుడూ ఇప్పుడూ కూడా దాడికి పాల్పడిన వారు ముగ్గురే కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
రామశేషు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో శ్రీకూర్మంలోని తన ఇంటి నుంచి తన భారత్ గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లారు. రెండు వాహనాలకు బండలు లోడ్ చేయించి పంపించారు. మరో వాహనం కోసం ఎదురు చూస్తూ గోడౌన్ ముందు దువ్వుపేటకు వెళ్లే రోడ్డుపైకి వచ్చి నిలుచున్నారు. అదే సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న దుండగులు పదునైన కత్తితో ఆయనపై దాడి చేశారు. ముఖం, మెడపై బలంగా దాడి చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడు గులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు గ్రామంలోని వారికి విషయం చెప్పారు. రామశేషుకు భార్య జయలక్ష్మి (శ్రీకూర్మం పంచాయతీ ఉప సర్పంచ్), కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి బరాటం నాగేశ్వరరావు సీనియర్ వైఎస్సార్ సీపీ నాయకుడు కాగా శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.