రోహిత్ శర్మ వీరోచిత పోరాటం..చివరి దశలో టీమిండియా ఓటమి
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో టీమిండియా 272 పరుగుల లక్ష్యఛేదనలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బొటనవేలి గాయంతో చివర్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం వృథా అయింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ విసిరిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి ఆశలు కల్పించాడు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కుతుందనగా, ముస్తాఫిజూర్ యార్కర్ వేయడంతో రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టేందుకు సాధ్యపడలేదు. దాంతో టీమిండియా స్కోరు 266 పరుగుల వద్ద నిలిచిపోయింది. విరాట్ కోహ్లి 5, ఓపెనర్ శిఖర్ ధావన్ (8) సైతం విఫలం కావడంతో టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 11, కేఎల్ రాహుల్ 14 పరుగులకే వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 6 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియా ఇన్నింగ్స్ సజావుగానే సాగింది. వీరిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.