Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్ |జగిత్యాల టౌన్
కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో దేశాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అప్పనంగా అయ్యజాగీరులాగా ప్రజల ఆస్తులను సావుకార్లకు దోచిపెడుతున్నారు. మోడీ పార్టీకి నిధులిచ్చే వ్యాపారుల చేతిలోకి విద్యుత్‌రంగాన్ని పెట్టబోతున్నారు. ఎందరో ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్య్రదేశాన్ని ఆగమాగం చేస్తూ అధోగతిపాలు చేస్తున్నారు. ఇప్పుడు మనంతా పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలి. అందుకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేదిగా తెలంగాణ ముందుండాలి' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటంచిన ఆయన కలెక్టరేట్ భవనాన్ని, పార్టీ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. రూ.510కోట్లతో నిర్మించబోతున్న మెడికల్‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్ర సమీపంలోని మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
ఆద్యంతం కేంద్రంలోని బీజేపీని దునుమాడుతూనే రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. డైలాగుకే పరిమితమైన వాగ్ధానాలు, మేక్ ఇన్ ఇండియా సబ్ కా సాత్, సబ్ కా వికాస్ వంటి నినాదాలు డైలాగులకే పరిమితం అయ్యాయని కేసీఆర్ విమర్శించారు. ఏ ఒక్క రంగంలో అయినా మేక్ ఇన్ ఇండియా చేయని మోదీ... గోర్లు కత్తిరించుకునే కట్టర్ నుంచి దీపావళి టపాసులు, దీపంతలు, పతంగులు ఎగరవేసే ధారం వరకూ చైనా నుంచే వస్తున్నాయనివివరించారు. ఆఖరికి దేశ జాతీయ జెండాను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మండిపడ్డారు.
మేక్ ఇన్ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ ఉన్నవి ఊడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయని, ఫ్యాక్టరీల్లో 50 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని తెలిపారు. కేంద్రం పాలసీతో 10 వేల మంది పారిశ్రామికవేత్తలు దేశం వదిలిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే రైతాంగానికి ఏటా రూ.14వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచిత కరెంటు ఇస్తుంటే 'రేవుడి కల్చర్'అని, సంక్షేమాలను ఉచితాలంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర సర్కారు ప్రజాఅవసరాలకు కాకుండా ఎన్‌పీఏ పేరుతో రూ.14లక్షల కోట్లు సంపన్నులకు రాయితీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
ఇక సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ జో బక్వాస్‌గా మారిందన్నారు. బేటీ పడావో.. బేటీ బచావో అంటూ చెబుతున్న కేంద్ర సర్కారు అంగన్‌వాడీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. పైగా ఉత్తర భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై రేప్‌లు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారిన పరిస్థితిని దేశమంతా చూస్తోందన్నారు. దేశానికి ఏ రంగం ఏ జరిగిందో యువకులు, మేధావులు, విద్యావంతులు ఆలోచన చేయాలని, ఆ విషయాలను గ్రామగ్రామాన యువతకు, ప్రజలకు చెప్పాలని కోరారు.
ఎల్‌ఐసీ ఏజెంట్లు సైనికుల్లా మారాలి 'ఏ చిన్న పల్లెటూరికి వెళ్లి ఎవరినైనా బీమా చేశావా? అని అడగారని, ఎల్‌ఐసీ పాలసీ కట్టినవా? అనే అడుగుతారన్నారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థను అప్పనంగా ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు.
25లక్షల మంది ఏజెంట్లు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్‌ఐసీకి రూ.35లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటిని దోచుకునే పని గట్టుకుందన్నారు. ఎల్‌ఐసీని సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లే కాదు.. ప్రజలూ కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. దండంపెట్టి మాట్లాడుతున్న తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని కనీసం ఆయన తన సొంత రాష్ట్రంలో సరిపడా కరెంటు, దేశ రాజధానిలో కడుపునిండా మంచినీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. ఏ ఒక్క రంగంలోనూ మంచి పని చేయకపోగా వందేళ్లు వెనక్కిపోయేలా పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మతపిచ్చిలో పడి మన అన్నిరకాలుగా వెనుబడిపోతున్నాం. ఇప్పటికైనా మేల్కోకపోతే వందేళ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దండం పెట్టి మాట్లాడుతున్నా నా వెంట నడవండి దేశ రాజకీయాలను తెలంగాణ రాష్ట్రమే ప్రభావితం చేయాలి. దేశం పిడికిలెత్తి ప్రజల ఆస్తులను కాపాడుకోవాలి' అంటూ పిలుపునిచ్చారు.
ప్రజా సం'క్షేమమే' సర్కారు ధ్యేయం దేశంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదని, రాష్ట్రంలోనే 7వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడికక్కడ పంటను కొంటుంది తెలంగాణ మాత్రమేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలూ ఇక్కడే అమలవుతున్నాయని, కేసీఆర్ బతికున్నంతకాలం అవి ఆగవని స్పష్టం చేశారు. మరో ఐదు పది రోజుల్లో రైతుబంధు అన్నదాతల ఖాతాలో పడుతాయని, రెండు రోజుల్లో కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షలాది బీడీ కార్మికులకు రూ.2016 ఇస్తుందీ తెలంగాణ మాత్రమేనన్నారు. ఆడపిల్ల పెండ్లికి కళ్యాణలక్ష్మి, ఆమె ప్రసవిస్తే కేసీఆర్ కిట్ వంటి సంక్షేమం అందిస్తుంది మనేనన్నారు.
కొండగట్టుకు రూ.100కోట్లు ప్రకటన
కొండగట్టు దేవస్థానానికి రూ.100కోట్లు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఆలయానికి 25 ఎకరాల స్థలమే ఉంటే మరో 385 ఎకరాలు కేటాయించామని గుర్తు చేశారు. ఇవేగాకుండా మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్‌ను మండలంగా చేస్తామని ప్రకటించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలకు అదనంగా రూ.10కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా పలువురుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.