Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిన్న ‘జూపల్లి మరో ప్రస్థానం’ పేరుతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న సొంత రాష్ట్రంలో ప్రజలు ఆశించిన మేర లక్ష్యాలు నెరవేరలేదని అన్నారు. కొల్లాపూర్‌లో 1,600 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఆర్డీవోపై చర్యలు తీసుకోలేదని అన్నారు.
కొల్లాపూర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి దివంగత రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2014 నుంచి 2018 వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతర కాలంలో హర్షవర్ధన్ టీఆర్ఎస్‌లో చేరారు. గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న జూపల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.