Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పార్లమెంటులో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు చేసిన ప్రకటనపైన కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం సింగరేణి విస్తరించిన ఏడేనిమిది జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్ర అని అన్నారు.
బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించి తెలంగాణ రైతన్నలకు మోడీ సర్కారు తీరని అన్యాయం చేసేందుకు కుట్రలకు తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్‌లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, అలాంటి సింగరేణిని ప్రయివేటీకరిస్తే కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న విద్యుత్ సరఫరాను దెబ్బతీయొచ్చన్న ఆలోచనతోనే కేంద్రం సింగరేణి పై కక్ష కట్టిందన్నారు.
సింగరేణి భుజంపై నుంచి తెలంగాణ ప్రజలపై గన్ను పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరుని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలని, తెలంగాణ ప్రజల పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తమ ఎంపీలు బొగ్గు గనుల వేలం అంశంపై పార్లమెంటులో నిలదీస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడిపై దెబ్బ కొట్టాలని చూస్తున్న కేంద్రం కుట్రలపై పోరాడేందుకు కలిసి రావాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.