Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్ : మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్ పనులకు మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టు మెట్రోను రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్‌లో బయో డైవర్సిటీ వద్ద రెండు ఫ్లై ఓవర్ల పైనుంచి మెట్రో వెళ్తుందన్నారు. ఎయిర్‌పోర్టు వద్ద 2.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ అండర్ గ్రౌండ్‌లో వెళ్తుందని పేర్కొన్నారు. అక్కడ అండర్ గ్రౌండ్‌లోనే మెట్రో స్టేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. మెట్రో గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు. 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకుంటారని పేర్కొన్నారు. రద్దీ సమయంలో ఎయిర్‌పోర్టుకు 8 నిమిషాలకు ఒక రైలు, రద్దీ లేని సమయంలో 20 నిమిషాలకు ఒక రైలు నడిపిస్తామన్నారు. భవిష్యత్‌లో 2.5 నిమిషాల నుంచి 5 నిమిషాలకు ఒక రైలు ఉండేలా చూస్తామన్నారు. రాయదుర్గం స్టేషన్‌లోనే చెక్ ఇన్, లగేజ్ చెక్ ఇన్ చేసేలా చూస్తున్నామని తెలిపారు.
31.50 కోట్ల మంది ప్రయాణం..
మెట్రోలో ఇప్పటి వరకు 31.50 కోట్ల మంది ప్రయాణించారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ద్వారా 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అయిందని పేర్కొన్నారు. మెట్రో రెండో విడత డీపీఆర్‌ను కేంద్రానికి పంపామని ఆయన గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ మెట్రో పనులను ప్రారంభిస్తామని చెప్పారు.