Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీలో 26 ఏళ్ల అఖిల్ జ్యుయలరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ అఖిల్ తండ్రి భరత్ మహాజన్‌శెట్టి ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు ఫోన్ చేశాడని, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ తరుణంలో తండ్రి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. కొన్ని ఆధారాలు లభించిన తర్వాత తండ్రి భరత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
దీంతో వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్‌కు అప్పగించి ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లినట్లు తెలిపాడు. కిల్లర్లు అతడ్ని హత్య చేసి దేవికొప్పలోని చెరకు పొలాల వద్ద మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. పోలీసులు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. కిమ్స్ ఫోరెన్సిక్ వైద్య నిఫుణులతో పోస్ట్‌మార్టం చేయించారు. మృతుడి తండ్రి భరత్‌తోపాటు ఆరుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో మరి కొంతమంది పాత్ర కూడా ఉండవచ్చని పోలీస్ అధికారి తెలిపారు.