Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం తమిళనాడులోని కారైక్కాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద శుక్రవారం అర్దరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని వల్ల పుదుచ్చేరి, శ్రీహరికోట, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంట 65 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా, రాయలసీమ, పుదుచ్చేరి, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
మత్స్యకారులు ఈ నెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ సూచించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఏపీ అలర్ట్ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో హెచ్చరిక సందేశాలు పంపామన్నారు.