Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి ప్రభుత్వం తాజాగా మరణశిక్ష అమలు చేసింది. ఈ ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వం ఇలాంటి శిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబరు 25న దేశ రాజధాని టెహ్రాన్ లోని ఓ రోడ్డును బ్లాక్ చేయడంతోపాటు పారామిలిటరీ సిబ్బందిలో ఒకరిని గాయపరిచినట్టు మొహసెన్ షెకారీ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు అతడిని దోషిగా తేల్చింది. షెకారీ దైవ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడంటూ నవంబరు 1న మరణశిక్ష విధించింది. ఈ తీర్పును అతడు సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తాజాగా అతడిని ఉరిశిక్ష అమలు చేశారు.
షెకారీకి మరణశిక్ష అమలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా తిరుగుబాటును అణచివేసేందుకు, ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకే ఇలాంటి శిక్షలు విధిస్తున్నారంటూ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. షెకారీ ఉరిశిక్షపై అంతర్జాతీయ సమాజం స్పందించకుంటే ఇరాన్‌లో ఉరిశిక్షలు రోజువారీ వ్యవహారంగా మారే ప్రమాదం ఉందని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ఆందోళన వ్యక్తం చేశారు.