Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: న్యాయమూర్తుల నియామకంపై 2018లో అత్యున్నత ప్యానెల్ నిర్వహించిన సమావేశానికి సంబంధించిన వివరాలను అందించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇద్దరు జడ్జీల నియామకంపై డిసెంబర్ 12, 2018న జరిగిన కొలీజియమ్ సమావేశం వివరాలను అందించాలంటూ కార్యకర్త అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరగా, తిరస్కరించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ప్రాధమిక విచారణలోనే.. ఆ చర్చల వివరాలు ప్రజలకు వెల్లడించలేమని ప్రకటించింది. కొలీజియం జరిపిన చర్చలన్నింటినీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచకూడదని, తుది నిర్ణయాలను మాత్రమే వెల్లడిస్తామని ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము వ్యాఖ్యానించదలుచు కోలేదని పిటిషన్‌ను కొట్టివేసింది.
కాగా, డిసెంబర్ 12, 2018లో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, ఎ.కె.సిక్రి, ఎస్.ఎ.బాబ్డే, ఎన్.వి.రమణ న్యాయమూర్తుల నియామకంపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఆ తర్వాత నిర్ణయాలను రద్దు చేశారు. అయితే సమావేశంలో తీసుకున్న తీర్మానం అప్‌లోడ్ చేయలేదని జనవరి 2019లో జస్టిస్ లోకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.