Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులతో బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రత్యేకంగా కలిశారు. సుమారు రూ.1.30 కోట్లతో 160 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్స్, ఒక్కొక్కరికి రూ.50వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ తరుణంలో మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ అట్టడుగువర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రయివేట్‌కు దీటుగా అందిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.
కేజీ టూ పీజీ విద్యలో భాగంగా సీఎం కేసీఆర్ అనేక గురుకులాలను ఏర్పాటు చేశారని వివరించారు. గిరిజన బిడ్డలను విద్యావంతుల్ని చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని, అందువల్లే గతంతో పోలిస్తే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం ఇప్పుడు అత్యధికంగా పెరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గిరిజనుల కోసం ప్రత్యేకంగా 92 గురుకులాలని స్థాపించారని, వాటి ద్వారా వేలాది మంది గిరిజన చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన 160 మంది విద్యార్థులకు సుమారు రూ.1.30 ల్యాప్ టాప్‌లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహాకాన్ని అందించినట్లు వెల్లడించారు. ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నదని, అందులోనూ సీట్లు పొందినవారికి త్వరలో అందజేస్తామని మంత్రి తెలిపిపారు. గిరిజన విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్‌డీ రంగారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశం, ఓఎస్‌డీ కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ రాజేంద్రనగర్ సురేందర్, వరంగల్ ప్రిన్సిపాల్ పద్మిని తదితరులు పాల్గొన్నారు.