Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్పూర్: మితిమీరిన మోతాదులో ఔషధాలు అందించడం ద్వారా భర్తను చంపిన ఓ కిలాడీ లేడీ వ్యవహారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కల్యాణ్‌పుర్ శివ్లి రోడ్డు ప్రాంతానికి చెందిన రిషబ్ గత నెల 27న ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అక్కడి నుంచి ఇంటికి తిరిగొస్తుండగా అతడిపై దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఈ నెల 1న డిశ్ఛార్జయ్యాడు.
అయితే తర్వాత రెండు రోజులకే ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అతడి మరణంపై భార్య సప్నా ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అధిక మోతాదులో ఔషధాలు తీసుకోవడంతో చాలా అవయవాలు దెబ్బతిని రిషబ్ మృతిచెందినట్లు శవపరీక్షలో తేలడాన్ని గుర్తించారు. సప్నాతోపాటు కొందరు అనుమానితుల ఫోన్‌కాల్‌లు, వాట్సాప్ చాట్‌లను పరిశీలించారు. దీంతో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త తన పేరిట ఆస్తి రాస్తాడో లేదో అన్న అనుమానంతో.. ప్రేమికుడు రాజుతో కలిసి ఆమే హత్య చేయించినట్లు తేటతెల్లమైంది. మితిమీరిన మోతాదులో ఔషధాలను ఇవ్వాలన్న ఆలోచన తనకు ఓ క్రైం సీరియల్ చూడటం ద్వారా వచ్చిందని పోలీసుల విచారణలో సప్నా వెల్లడించింది.