Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలితో పరిచయం పెంచుకున్న నవీన్ రెడ్డి తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో తన తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని, శుక్రవారం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి ఏకంగా వందమందితో వైశాలి ఇంటికి చేరుకొని, అడ్డువచ్చిన వారిని కొట్టి మరీ ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో వైశాలి కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందున్న టీ దుకాణాన్ని తగలబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న డాక్టర్ వైశాలి సంచలన విషయాలు బయటపెట్టింది. తన పట్ల కిడ్నాపర్లు దారుణంగా వ్యవహరించారని వైశాలి కన్నీరు పెట్టారు. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. అతడితో పెళ్లి ఇష్టంలేదని చెప్పాను. ఫొటోలు కూడా మార్ఫింగ్ చేశారు. పెళ్లి చేసుకోకపోతే మా నాన్నను చంపేస్తామని నవీన్ బెదిరించాడు.
పదిమంది నన్ను కారులో ఎత్తుకెళ్లారు. ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావని కారులో బెదిరించి కొట్టారు. నా కేరీర్ నాశనం చేశారు. నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ వాళ్లు పట్టించుకోలేదు. పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అని వైశాలి తెలిపింది.