Authorization
Sat May 17, 2025 05:07:05 am
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు టీపీసీసీ కార్యవర్గాన్ని విస్తరించింది. ఏకంగా 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు, 40 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతో జంబో కార్యవర్గాన్ని నియమించింది. దీంతోపాటు 18 మంది సభ్యులు, నలుగురు ఆహ్వానితులతో నూతన రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రానున్న ఎన్నికలను ఎదుర్కొనే కమిటీ కావడంతో పార్టీ నేతలందరి సూచనల్నీ పరిగణనలోకి తీసుకుని శనివారం ఈ నియామకాలు చేపట్టింది. వీరితోపాటు 26 డీసీసీలకు అధ్యక్షులనూ నియమించింది. తొమ్మిది డీసీసీలకు అధ్యక్షుల నియామకాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కొత్త కార్యవర్గంలో మెండి చెయ్యి చూపించింది. పైగా కీలక నిర్ణయాలు తీసుకునే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి కూడా ఆయనను తప్పించింది. పార్టీ ముఖ్యనేతలందరికీ ఏదో ఒక కమిటీలో చోటు దక్కినా.. కోమటిరెడ్డికి మాత్రం ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. తద్వారా ఏ స్థాయి నేతలైనా క్రమశిక్షణ మీరితే పక్కన పెట్టేస్తామనే సంకేతాన్ని ఇచ్చింది.
పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పీఏసీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా అధిష్ఠానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ్యులుగా నియమించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అజరుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లను పీఏసీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. గత పీఏసీకి ఉన్న కన్వీనర్ పోస్టును తొలగించారు.