Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగల్లే చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసి అవుటయ్యాడు. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన 24 ఏళ్ల ఇషాన్ కిషన్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు.
కెరియర్‌లో పదో వన్డే ఆడిన ఇషాన్ ఒకే ఒక్క అద్భుత ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను బద్దలుగొట్టాడు. పాట్నాకు చెందిన ఇషాన్ వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఇండియన్‌గానూ తన పేరును రికార్డు పుస్తకాల్లో రాసుకున్నాడు. ఈ క్రమంలో 2011 ప్రపంచకప్‌లో భాగంగా మీర్పూర్‌లో జరిగిన వన్డేల్లో బంగ్లాదేశ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన 175 పరుగుల రికార్డు కనుమరుగైంది. అంతేకాదు, డబుల్ సెంచరీ సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ (మూడుసార్లు) ఉన్నారు.
- 2015లో జింబాబ్వేపై క్రిస్ గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా ఇషాన్ ఇప్పుడు 126 బంతుల్లోనే సాధించి ఆ రికార్డును తుడిచిపెట్టేశాడు.
- గతంలో రోహిత్ శర్మ 26 సంవత్సరాల 186 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. 2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ‘డబుల్’ బాదగా, ఇషాన్ 24 సంవత్సరాల 145 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు.
- వన్డే ఫార్మాట్‌లో ఓవరాల్‌గా ద్విశతకం సాధించిన ఏడో ఆటగాడిగా ఇషాన్ కిషన్. అతడికంటే ముందు టెండూల్కర్, రోహిత్ శర్మ, సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, మార్టిన్ గప్టిల్ ఉన్నారు.
- టీమిండియాలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా ఇషాన్. అతడికంటే ముందు రోహిత్ శర్మ 264, సెహ్వాగ్ 219 పరుగులు సాధించారు.
- బంగ్లాదేశ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) కొట్టిన ఆటగాడిగా ఇషాన్ రికార్డ్. గతంలో 2000వ సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఏడు సిక్సర్లు బాదాడు.
- బంగ్లాదేశ్‌లో ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక పరుగులు (210) ఇవే. 2011లో మీర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో షేన్ వాట్సన్ అజేయంగా 185 పరుగులు చేశాడు.
- ఇషాన్ ఖాతాలో మరికొన్ని రికార్డులు కూడా చేరాయి. బంగ్లాదేశ్‌పై 2009లో బులవాయోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేకు చెందిన చార్లెస్ కోవెంట్రీ బంగ్లాదేశ్‌పై అజేయంగా 194 పరుగులు చేయగా, ఇషాన్ 210 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలుగొట్టాడు.
- ఓ ఇండియన్ ఓపెనర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో టాంటన్‌లో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ 183 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డు కూడా బద్దలైంది.
- ఇండియా బయట ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇషాన్ ఖాతాలో మరో రికార్డు. 2011లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ 8 సిక్సర్లు కొట్టాడు. ఇషాన్ 10 సిక్సర్లు బాది ఆ రికార్డును తుడిచిపెట్టేశాడు.