Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రేపు క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఎల్లుండి కొత్త దుస్తుల పంపిణీ ఉంటుందన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై పలు క్రిస్టియన్ సంస్థలు, పాస్టర్లతో మంత్రి తలసాని మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్లకు గతంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రిస్టియన్ భవనం నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇందుకోసం ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించిందని గుర్తు చేశారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వమే రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఈ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. సంఘాలు, వర్గాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు హాజరై శంకుస్థాపన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 13 వ తేదీన నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు.