Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షిమ్లా: సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా వీరభద్రసింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రమాణస్వీకారానికి ముందు సుఖ్విందర్ సింగ్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరుతూ తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె తన కొడుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పాలన సాగించాలని ఆశీర్వదించారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్‌ను సుఖ్విందర్ సింగ్ ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని స్వయంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ హైకమాండ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును, డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి పేరును ఖరారు చేసింది. దాంతో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకులు రాజీవ్ శుక్లా, భూపేశ్ బఘేల్ ఆధ్వర్యంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుఖ్విందర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు సమావేశం అనంతరం బఘేల్ ప్రకటించారు.