Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు పట్టాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన సమీక్షించారు. ఈ తరుణంలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ తండాలలో డ్రైనేజీలు, రోడ్లకు ప్రతిపాదనలు పంపాలన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 3 కోట్ల జంక్షన్, జ్యోతిరావు పూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి పరచాలన్నారు. రూ. 42.60 కోట్లతో మంజూరైన డోర్నకల్ రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నారు.
మంజూరు కాని రోడ్ల వివరాలు ఇవ్వాలని, తక్షణమే మంజూరు చేయిస్తామన్నారు. ఇల్లందు నుంచి పాకాల వెళ్లే రహదారిలో బ్రిడ్జి నిర్మాణాలు త్వరగా చేపట్టాలన్నారు. అదేవిధంగా కురవి నుండి జంగిలిగొండ, గార్ల రాంపూర్ బ్రిడ్జి, భూపతిపేట నుండి కొత్తగూడ వెళ్లే రహదారిలో మంజూరైన బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలన్నారు. రైతాంగాన్ని వాణిజ్య పంటలపై సాగు చేపట్టే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సత్యవతి రాథోడ్ సూచించారు. మహబూబాబాద్ అర్బన్, పెనుగొండ డబుల్ బెడ్రూం ఇండ్లను నెలాఖరులోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.