Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో ఒక వ్యక్తి చలాన్ తప్పించుకునేందుకు దారుణానికి పాల్పడ్డాడు. కారు నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్న అతడిని సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. దాంతో చలాన్ తప్పించుకునేందుకు అతను ఆ పోలీస్‌ను ఢీ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, పోలీస్ కారుకు అడ్డుగా నిలివడమే కాకుండా బ్యానెట్ మీద ఎక్కాడు. అప్పటికీ ఆ వ్యక్తి కారు ఆపలేదు. పోలీస్ కింద పడిపోవాలని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారును వేగంగా అటూఇటూ తిప్పాడు. అంతేకాదు కారు బ్యానెట్ మీద ఉన్న ఆ పోలీసును ఏకంగా 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యూటీలో ఉన్న ఆ ట్రాఫిక్ పోలీస్ పేరు శివ సింగ్ చౌహన్. ఆ కారు డ్రైవర్‌ను గ్వాలియర్‌కు చెందిన కేవశ్ ఉపాధ్యాయ్‌గా గుర్తించారు. 'కారు నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని ఆపి, ఫైన్ కట్టమని అడిగాను. కానీ, అతను చలాన్ కట్టేందుకు ఒప్పుకోలేదు. పైగా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో, నేను అతని కారు బ్యానెట్ మీదకు ఎక్కాను. అతను నన్ను అలానే 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు' అని శివ సింగ్ చౌహన్ వివరించాడు. అంతేకాదు అనుమానంతో అతని కారును చెక్ చేయగా ఒక తుపాకీ, తూటాలు దొరికినట్టు వెల్లడించాడు.